Gujarat Rains: గుజరాత్లో వర్ష బీభత్సం..అహ్మదాబాద్ సిటీ అల్లకల్లోలం

Gujarat Rains: గుజరాత్లో వర్ష బీభత్సం..అహ్మదాబాద్ సిటీ అల్లకల్లోలం

గుజరాత్ లో భారీవర్షాలు విధ్వంసం సృష్టించాయి. సూరత్, ఆమ్రేలీ, వల్సాద్, అహ్మదాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై పెద్ద పెద్ద గుం తలు పడ్డాయి. పెద్ద పెద్ద చెట్లు విరిగిపడి వాహనాలు ధ్వంసమయ్యాయి. రోడ్లపై, సబ్ వే ల వద్ద నీళ్లు నిలిచి చెరువుల్లా కనిపించాయి.  దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

సూరత్ , అమ్రేలీ, వల్సాద్ తో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం తీవ్ర నష్టం కలిగించింది. ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జనజీవనం ఎక్కడిక్కడ నిలిచిపోయింది. గుజరాత్ లోని ప్రధాన నగరాల్లో భారీ వర్షం కారణంగా వరదలు ఎంత ప్రభావం చూపాయో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చెబుతున్నాయి. 

అహ్మదాబాద్ లోని షేలా ప్రాంతంలో రోడ్డుపై పెద్ద చెట్టు విరిగి రెండు కార్లపై పడటంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి.ఆదివారం (జూన్ 30, 2024న )గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భారీ వర్షాల కారణంగా తీవ్ర అంతరాయం ఏర్పడింది. కుండపోత వర్షం కారణంగా షేలా ప్రాంతంలో రోడ్డు కుంగిపోయి పెద్ద గుంత  ఏర్పడింది.

నగరం అంతటా భారీగా నీరు నిలిచి, మకర్బా, గోటా, సర్దార్‌నగర్-విమానాశ్రయం , నవరంగపుర వంటి ప్రాంతాలను ముంచేశాయి. నగరంలోని దారుణమైన పరిస్థితు లను చూస్తుంటే.. మౌలిక సదుపాయాల , ముఖ్యంగా వర్షాకాలంలో భారీ వర్షపాతాన్ని నిర్వహించగల సామర్థ్యం గురించి ఆందోళన కలిగిస్తున్నాయి. 

కోస్తా తుపాను ప్రభావంతో మరో ఐదు రోజులు గుజరాత్ అంతటా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి.. భరూచ్, సూరత్, నవ్ పారి, వల్సాద్, దాద్రా నగర్ హవేలీ లలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.